కలం, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Buttler) అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతాంప్టన్‌లో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు. భారత్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును తుడిచిపెట్టేసి, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 44 బంతుల్లో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన టీ20 కెరీర్ పరుగులు 4,292కి చేరాయి. రోహిత్ శర్మ సాధించిన 4,231 పరుగుల రికార్డును దాటి బట్లర్ ముందుకు వెళ్లాడు.
ప్రస్తుతం బాబర్ ఆజమ్ 4,596 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 49 బంతుల్లోనే 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బట్లర్ (Jos Buttler), బ్రూక్ కలిసి రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల కొండంత స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. సోనీ బేకర్ 12 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక 135 పరుగులకే ఆలౌటైంది. 119 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిపత్యం సాధించింది.
Also Read : ఐపీఎల్ 2027 వేలం భారత్‌లోనే.. బిగ్ అప్‌డేట్!
Follow Us On : WhatsApp

