కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కుర్నపల్లి (Kurnapalli) అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు చిక్కి ఒక చిరుత పులి దారుణంగా మృతి చెందింది. అనంతరం ఆ చిరుత పులి చర్మం, ఇతర శరీర భాగాలను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అటవీ శాఖ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు వివరాలను భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్తో కలిసి ఎఫ్డీఓ నిషా వెల్లడించారు. కుర్నపల్లి అడవుల్లో ఉచ్చులో చిక్కి చనిపోయిన చిరుత నుంచి వేటగాళ్లు సేకరించిన చర్మంతో పాటు 9 గోళ్లు, 6 పళ్లు, పుర్రెను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన చర్ల మండలం కుర్నపల్లికి చెందిన కోరం నారాయణ, కిష్టారంపాడుకు చెందిన పొడియం దేవేందర్, పొడియం సంతోష్, దీర్థో బండి, బెస్త కొత్తూరుకు చెందిన అట్టం సాయికిరణ్, ములుగు జిల్లా గోంపుని గూడెంకు చెందిన జీల కర్ర రాధాకృష్ణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడటం, వాటి శరీర భాగాలను రవాణా చేయడం లేదా అమ్మడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. అటవీ సంపదను, అందులోని జీవులను రక్షించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ రాజు వర్మ, అటవీ క్షేత్ర అధికారిణి రంజిత తదితర అధికారులు పాల్గొన్నారు.

