కలం, వెబ్ డెస్క్: ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ-ఏ కేటగిరీలో చేర్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ (Jangiti Srinivas Mudiraj) డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల బీసీ-ఏ సాధన కోసం బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రులకు అందజేసిన వినతిపత్రాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు.
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ ప్రతినిధులు రెడ్డి యాదగిరి, రావుల రాజు, యాట రాజేశ్, మైలారం వంశీలతో కలిసి జంగిటి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముదిరాజ్‌లకు ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా తగిన ప్రయోజనం లభించడం లేదన్నారు.
రిజర్వేషన్ అవకాశాలు పరిమితంగా ఉండటంతో ఉన్నత విద్యనభ్యసించిన యువతకు తగిన స్థాయిలో విద్యా, ఉద్యోగ అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా శ్రమను నమ్ముకుని జీవిస్తున్న ముదిరాజ్ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రావాల్సిన అవసరముందని చెప్పారు. పండుగ సాయన్న వర్ధంతి నాటికి తమ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

