కలం, నల్లగొండ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు (Nalgonda Corporation) భారీగా నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని మోడల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి (Mayor Burri Chaitanya) తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు (చిట్టి) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో అర్హులైన పేద కుటుంబాలకు మొత్తం 62,853 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరైనట్లు వెల్లడించారు. రాబోయే మూడు రోజుల్లో అన్ని డివిజన్లలో కార్డుల పంపిణీని వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల డిజిటలైజేషన్‌తో బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత పెరుగుతుందని మేయర్ (Mayor Burri Chaitanya) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, అర్హులైన ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మేయర్ తెలిపారు. నల్లగొండలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రతి గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పచ్చల సోమేశ్వరాలయం నుంచి బైపాస్ వరకు ప్రధాన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
పర్యాటక అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్ట ఘాట్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే నల్లగొండ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్, ఆర్డీవో అశోక్ రెడ్డి, కార్పొరేషన్ మేయర్ వంశీకృష్ణ, తహసిల్దార్ పరశురాములు, పలువురు వార్డు కార్పొరేటర్లు, వార్డ్ ఆఫీసర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కరీంనగర్ కవులు, కళాకారుల పుట్టిల్లు: బండి సంజయ్
Follow Us On: X(Twitter)

