కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (Godavarikhani)లో ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్లొమా పూర్తి చేసిన 21 ఏళ్ల విద్యార్థిని ఈసెట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు సాధించి, ప్రాక్టికల్ అనుభవం కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు చేరింది. ఈ సమయంలో తాను కూడా అదే కాలేజీలో డిప్లొమా చదివానంటూ బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్‌మ్యాన్ (సూపర్వైజర్) ఆమెకు పరిచయమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు
పరిచయం పెరిగిన తర్వాత రవికుమార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని విద్యార్థిని (student) ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఆమె ఇంటర్న్‌షిప్‌ను మధ్యలోనే నిలిపివేసి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తుంది.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అయినప్పటికీ తనకు వేధింపులు కొనసాగుతున్నాయని, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు నవీన్‌తో పాటు రవికుమార్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide) పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14న ఆమె మృతిచెందింది. తనపై రవికుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడని, సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్న సూసైడ్ నోట్ లభించిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
నిందితుల కోసం పోలీసుల గాలింపు
విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్, రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. సూసైడ్ నోట్లోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో మృతదేహంతో కార్పొరేషన్ కార్యాలయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

