కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిషేధిత జాబితాలో నమోదైన భూముల సమస్యల (22A Land Issue)కు శాశ్వత పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏళ్లుగా సాగుతున్న అసైన్డ్ భూముల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కరించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ కమిటీ బాధ్యతలు స్వీకరించిన 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన మంత్రుల సమీక్షా సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారని, బాధితులకు త్వరితగతిన ఊరట కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని సమాచారం. ఈ కీలక విషయమై ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

