కలం, స్టేషన్ ఘన్‌పూర్: తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 4,383 నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు కాగా, 3,146 తండాలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు. కొత్త పంచాయతీలకు ప్రత్యేక గ్రాంట్ల కింద సుమారు రూ.3 వేల కోట్లు కేటాయించి మౌలిక వసతులు కల్పించామన్నారు. గిరి వికాస్ ద్వారా 56,613 ఎకరాలకు పట్టాలు, 91 రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన పంచాయతీలకు రూ.1,000 కోట్ల ఎస్టీ స్పెషల్ గ్రాంట్, నియోజకవర్గానికి రూ.3 కోట్లతో గిరిజన భవనాలు ఏర్పాటు చేశామని వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, డ్రైవర్ కమ్ ఓనర్ పథకం, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్ల ద్వారా పెద్దఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున పంచాయతీ భవనాల కోసం నిధులు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీ–ఎస్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని రాజయ్య విమర్శించారు. తుకారం, సంత్ సేవాలాల్, ఎరుకల కార్పొరేషన్లకు ఒక్కో దానికి రూ.500 కోట్లు, ఆదివాసీ పంచాయతీలకు సమ్మక్క–సారలమ్మ గ్రాంట్ కింద రూ.25 లక్షలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యా జ్యోతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17న పాలాభిషేకం:
తండాలు, గూడేలకు పంచాయతీ హోదా కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా సెప్టెంబర్ 17న నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని రాజయ్య పిలుపునిచ్చారు. ఎస్టీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, తండాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

