కలం, నారాయణపేట: డీజేల ఓనర్లను ముందస్తుగా బైండోవర్ చేసి…ఇతర జిల్లాలు, కర్ణాటక నుండి డీజే లు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఎస్పీ డాక్టర్ జి. వినీత్ (Narayanapet SP) అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడుతూ…నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో మొత్తం 1,509 గణేష్ విగ్రహాలు ఉండగా, అధిక సంఖ్యలో నిమజ్జనాలు 03, 05, 07, 09, 11 వ రోజుల్లో జరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. రౌడీ షీటర్స్, కమ్యునల్ షీటర్స్, సస్పెక్ట్స్ షీటర్స్ పై నిఘా పెట్టాలన్నారు. కొండారెడ్డిపల్లి చెరువు, కృష్ణా నది, జూరాల డ్యాం, మక్తల్ ట్యాంక్ బండ్, కోయిల్ సాగర్ తదితర నిమజ్జన ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు నీటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ల పై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు మహేష్, లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, సైదులు, ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్సైలు భాగ్యలక్ష్మీ రెడ్డి,వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, నరేష్, రాజు, రమేష్, అశోక్ బాబు పాల్గొన్నారు.

