ఆసియా గేమ్స్‌లో స్క్వాష్ టీమ్.. గోల్డ్ టార్గెట్!

కలం, స్పోర్ట్స్ : జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత స్క్వాష్ (India Squash Team) జట్టు సిద్ధమైంది. ఎనిమిది మంది ఆటగాళ్లు శుక్రవారం చెన్నై నుంచి జపాన్‌కు బయలుదేరనున్నారు. గత ఆసియా గేమ్స్‌లో సాధించిన ఐదు పతకాలను ఈసారి అధిగమించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సింగిల్స్‌లో ఎప్పటి నుంచో అందని బంగారు పతకాన్ని సాధించడంపై దృష్టి పెట్టింది. ఆసియా గేమ్స్‌లో స్క్వాష్ ప్రవేశించిన 1998 నుంచి భారత్ 18 పతకాలు సాధించింది. ఇందులో మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. హాంగ్‌జౌ గేమ్స్‌లో భారత్‌కు ఐదు పతకాలు వచ్చాయి. డిపికా పల్లికల్ కార్తిక్, హరీందర్ పాల్ సింగ్ సంధు మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించారు.

పురుషుల టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ బంగారు పతకం గెలిచింది. సౌరవ్ ఘోసల్ సింగిల్స్‌లో రజతం సాధించారు. అనాహత్ సింగ్, అభయ్ సింగ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సాధించారు. మహిళల టీమ్ కూడా కాంస్య పతకం గెలుచుకుంది. ఈసారి సింగిల్స్‌లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ భారత ప్రధాన ఆశలుగా ఉన్నారు. మహిళల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. ఆమె మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. పురుషుల ప్రపంచ 24వ ర్యాంకర్ అభయ్ సింగ్ రెండో సీడ్‌గా ఉన్నారు. వీర్ చోత్రాని నాలుగో సీడ్‌గా, తన్వి ఖన్నా ఏడో సీడ్‌గా పోటీ చేయనున్నారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ జోడీ మూడో సీడ్‌గా ఉంది. సూరజ్ చంద్, షమీనా రియాజ్ మరో భారత జోడీగా బరిలోకి దిగనుంది. ఎనిమిది మంది ఆటగాళ్లు తమ తమ పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్లలోనూ పాల్గొంటారు. జోష్నా చిన్నప్పకు ఈ ఆసియా గేమ్స్ ప్రత్యేకం కానుంది. వరుసగా ఏడు ఆసియా గేమ్స్‌లో పాల్గొనే తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 39 ఏళ్ల జోష్నా 2002 నుంచి ప్రతి ఆసియా గేమ్స్‌లోనూ ఆడుతున్నారు.

వీర్ చోత్రాని, వేలవన్ సెంథిల్‌కుమార్, సూరజ్ చంద్, షమీనా రియాజ్ తొలిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నారు. భారత కోచ్ హరీందర్ పాల్ సింగ్ సంధు జట్టుపై నమ్మకం వ్యక్తం చేశారు. గతసారి కంటే మెరుగైన పతకాల ప్రదర్శన చేసే అవకాశం ఉందని చెప్పారు. సింగిల్స్ గోల్డ్‌పై కూడా సంధు ఆశాభావం వ్యక్తం చేశారు. సవాలు పెద్దదేనని, అయితే ఆ అడ్డంకిని దాటగల ఆటగాళ్లు భారత్ వద్ద ఉన్నారని తెలిపారు.

అనాహత్ ప్రస్తుత ఫామ్, ఆత్మవిశ్వాసం, అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధిస్తున్న పురోగతి ఆమెను బలమైన గోల్డ్ కంటెండర్‌గా నిలబెడుతున్నాయని సంధు పేర్కొన్నారు. అయితే ఆసియాలో పోటీ చాలా కఠినంగా ఉంటుందని జట్టు గుర్తిస్తోంది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెట్టి, వ్యూహాలను సరిగ్గా అమలు చేయడం, ఆటగాళ్లను ఒత్తిడికి సిద్ధం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సంధు తెలిపారు. స్క్వాష్ పోటీలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సింగిల్స్ విజేతలకు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో స్క్వాష్ అరంగేట్రం కోసం నేరుగా అర్హత లభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>