కలం, ఖమ్మం బ్యూరో : జిల్లాలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP) అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాడుబడిన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి గంజాయి విక్రయాలు, సరఫరా చేసే ప్రధాన నెట్‌వర్క్‌లను పూర్తిగా ఛేదించాలని స్పష్టం చేశారు.
అలాగే, దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జ్‌షీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా వెంటనే కోర్టుల్లో దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుని, మోసపోయిన నగదును వెంటనే ఫ్రీజ్ చేయించి తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోక్సో, మహిళా సంబంధిత కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

