కలం, ఆదిలాబాద్ : నార్నూర్ (Narnoor) మండలంలోని బాలన్పూర్, జామ్ద గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నూతన పంచాయతీ భవనాన్ని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సర్పంచ్ ఆత్రం సంగీత, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు :
జామ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మరో లబ్దిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు.

