కలం, జోగులాంబ గద్వాల: 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని గద్దెనెక్కి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గద్వాల (Gadwal) నియోజకవర్గ ఇన్చార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆరోపించారు. హామీల పేరుతో ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చాక రైతులను నడిరోడ్డుపై బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలో కరెంటు కోతలు, లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యలను నిరసిస్తూ మంగళవారం గద్వాల పట్టణం నదీ అగ్రహారం రోడ్డులో గల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎస్ఈ కార్యాలయం ముందు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిరసన (TRS Protest) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత విద్యుత్ దేవుడెరుగు, ఉన్న విద్యుత్ కూడా సరిగ్గా అందడం లేదు అని లో-వోల్టేజ్, అలాగే అర్ధరాత్రి వేళల్లో ఇచ్చే అరకొర విద్యుత్ వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. రైతులు రాత్రి వేళల్లో పాములు, పురుగుల మధ్య పొలాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో అమలైన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడం వల్ల బాధితులకు పరిహారం అందడం లేదు అని, అలాగే పూర్తిస్థాయిలో పంట రుణమాఫీ వర్తింపజేయకుండా రైతులను వంచించారు అని మండిపడ్డారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కేవలం స్వార్థ రాజకీయాలు, పార్టీలు మారడంపై ఉన్న ధ్యాస నియోజకవర్గ అభివృద్ధిపై గానీ, రైతుల సమస్యలపై గానీ లేదు అని ఆరోపించారు. అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల గ్రామాలు చీకటిలో మగ్గుతుంటే, పాలకులు మాత్రం అధికార వెలుగుల్లో ఊరేగుతున్నారు అని అన్నారు. విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్, మోటార్ల కాలిపోవడం వంటి సమస్యలకు ప్రభుత్వం తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రైతులను, ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ టీఅర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుచ్చిబాబు, రంగస్వామి, వెంకట్రాములు, విష్ణు, గోవిందు, బలరాం నాయుడు, రవి,సలీం,సుభాష్, లక్ష్మన్న, గోపాల్, మీసాల కిష్టన్న, చిన్న రాముడు, జమ్మన్న, విజయ్,భీమన్ గౌడ్, దయాకర్, వెంకటేష్, అమ్రేష్, వాసు, నర్సింహా, సర్వేష్, రాము, మల్దకల్, ఆంజనేయులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : మహిళ కొంపముంచిన 80s ట్రెండ్.. 45 ఏళ్ల నాటి చోరీ గుట్టురట్టు
Follow Us On : WhatsApp

