కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా టీఎన్జీవోస్ (Karimnagar TNGOs) ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ఉద్యోగులు పంపిణీ చేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు.
మట్టి గణపతి మహాగణపతి అంటూ దారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వలన నీటి వనరులు, పర్యావరణం కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ ఆరు డీఏలు, సమర్థవంతమైన ఆరోగ్య సేవలు, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సకాలంలో అందుబాటులో ఉండే విధానం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ జరగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులు నిరంతర సేవలు..
ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచి ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషిస్తారని దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ నాయకత్వంలో ఉద్యోగులకు రావలసిన హక్కులు నెరవేరాలని విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి, సంఘం లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హరిమేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, పెండ్యాల కేశవరెడ్డి, నేరెళ్ల కిషన్, రాకేష్, శ్రీధర్ పాల్గొన్నారు.

