కలం, తెలంగాణ బ్యూరో: అత్యవసర వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)పై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన రోగికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడం, నయం చేయకుండానే ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడాన్ని తప్పుపట్టింది. చివరికి రోగి చనిపోయినందున మృతుడి కుటుంబానికి రూ.43.37 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
గుండెపోటు కారణంగా 2013లో చనిపోయిన దేవేందర్ (53) అనే రోగి భార్య, కుమారుడు, కుమార్తె దాఖలు ఇచ్చిన ఫిర్యాదుపై 13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఈ పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేయని పక్షంలో సంవత్సరానికి 9 శాతం వడ్డీ చొప్పున చెల్లించే కాలం వరకు భరించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో ఫోరం స్పష్టం చేసింది.
రోగి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన వివరణ పట్ల ఫోరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కమిషన్ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయలేకపోయారని వ్యాఖ్యానించింది. పేషెంట్ అడ్మిషన్ విషయంలోనూ రికార్డుల్లో వేర్వేరు టైమింగ్స్ ఉన్నాయని తప్పుపట్టింది.
అసలేం జరిగిందంటే..
వారాసిగూడకు చెందిన దేవేందర్ 2013 మార్చి 22న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పక్షవాతం లక్షణాలతో సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరాడు. అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆస్పత్రిలో చేరినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారని ఫోరం వెల్లడించింది. తొలి గంట ‘గోల్డెన్ అవర్’ సమయాన్ని వృథా చేశారని తెలిపింది. న్యూరాలజిస్ట్ అందుబాటులో లేరనే కారణంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారని, సాయంత్రం 7.13 గంటల తర్వాతనే ట్రీట్‌మెంట్ ప్రారంభమైందని వివరించింది.
ఆలస్యానికి కారణం ‘క్లాట్ బస్టింగ్’ అని వైద్యులు విచారణ సందర్భంగా పేర్కొన్నా మెడికల్ రికార్డుల్లో మాత్రం దాన్ని ప్రస్తావించలేదు. ఉద్దేశపూర్వకంగా బాధ్యతల నుంచి తప్పించుకోడానికే వైద్యులు ఈ సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఆస్పత్రి నిర్లక్ష్యం మానసిక వేదనకు గురిచేసిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తూ కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని ఫోరంను కోరారు. ఈ కేసులో కీలకమైన ‘మాస్టర్ చార్ట్’తో పాటు సీటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు, మెడికల్ రికార్డులను కమిషన్‌కు (వినియోదారుల వివాదాల పరిష్కారం కమిషన్) చివరి వరకూ సమర్పించనే లేదని ఫోరం పేర్కొంది.
ఆ బాధ్యత ఆసుపత్రిదే..
ట్రీట్‌మెంట్ ఇచ్చిన తర్వాత రోగిని ఇంటికి తీసుకెళ్లి ప్రైవేట్ నర్సింగ్ కేర్ ఏర్పాటు చేసుకోవాలంటూ వైద్యులు సలహా ఇచ్చారని ఫోరం వెల్లడించింది. ఒకసారి ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఆసుపత్రిలో చేరిన తర్వాత అవసరమైన చికిత్స అందించాల్సిన బాధ్యత ఆసుపత్రిపైనే ఉంటుందని, ఆ బాధ్యతను కుటుంబ సభ్యులపైకి నెట్టలేరని స్పష్టం చేసింది. బాధిత కుటుంబం కోటి రూపాయల పరిహారం కోరగా కమిషన్ విచారించి మొత్తం రూ. 43.37 లక్షలు నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది.
వైద్య నిర్లక్ష్య పరిహారం కింద రూ. 40,11,876, ఎస్టేట్ నష్ట పరిహారం కింద లక్ష రూపాయలు, వైద్య రికార్డుల లోపభూయిష్ట నిర్వహణకు గాను మరో లక్ష రూపాయలు, కుటుంబానికి కలిగిన మానసిక వేదనకు మరో లక్ష రూపాయలు, లీగల్ ఖర్చుల కోసం రూ.25,000 చొప్పున మొత్తం రూ. 43,37,000 చెల్లించాలని ఫోరం స్పష్టం చేసింది.

