2029లోగా 21 రాష్ట్రాల్లో యూసీసీ: అమిత్ షా

కలం, నేషనల్ డెస్క్: దేశ వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమ‌లుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కీల‌క ప్రకటన చేశారు. 2029లోపు ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీ అమ‌లు చేస్తామ‌ని వెల్లడించారు. మ‌తంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, దత్తత, వార‌స‌త్వం అనే అంశాల‌కు ఒకే ర‌క‌మైన చట్టపరమైన నిబంధ‌న‌లు వ‌ర్తింప‌జేయాల‌న్న ఉద్దేశంతోనే త‌మ ప్ర‌భుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తీసుకొచ్చింద‌న్నారు.

బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన తరువాత ట్రిపుల్ తలాక్‌ రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేసినట్లు చెప్పారు. భారతీయ న్యాయ సంహిత ద్వారా దేశ నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేశామని, కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే నేర‌ నిర్ధారణ రేటు 30 శాతం పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయం అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

చొర‌బాటుదారుల‌ను పంపించేస్తాం..

జాతీయ భద్రతపై హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీల‌క వ్యాఖ్యలు చేశారు. దేశంలో చుక్క ర‌క్తం కార‌కుండా, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా ఆర్టికల్స్ 370, 35ఏ రద్దు చేసి కశ్మీర్ పూర్తిగా భారత్‌లో విలీనం చేశామన్నారు. దేశంలో అయిదు దశాబ్దాల నక్సలిజాన్ని అంతం చేయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 14కుపైగా శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ఆప‌రేష‌న్ క‌గార్‌తో దేశ వ్యాప్తంగా 9 వేల మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.

అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను గుర్తించేందుకు ఉపయోగించే పద్ధతులను బహిర్గతం చేయబోమని అమిత్ షా స్పష్టం చేశారు. ఒక్కొక్కరిని గుర్తించి దేశం నుంచి అక్రమ చొరబాటుదారులను పంపిస్తామని వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఇటీవల ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను ప్రారంభించామ‌న్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి రాష్ట్రాన్ని సందర్శించనున్నట్లు అమిత్ షా తెలిపారు.

Also Read : అల్వాల్‌లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>