టీమిండియాలో కేఎల్ రాహుల్‌‌కు కీలక బాధ్యత?

కలం, స్పోర్ట్స్ : టీమిండియాలో మరో కీలక బాధ్యతకు కేఎల్ రాహుల్ (KL Rahul) పేరు వినిపిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా రాహుల్‌ను నియమించే అవకాశం ఉంది. రాహుల్‌కు అగార్కర్ నుంచి కూడా మద్దతు ఉండటంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 30న గువాహటిలో, అక్టోబర్ 3న ముల్లన్‌పూర్‌లో మ్యాచ్‌లు ఉంటాయి.

సెప్టెంబర్ 16న సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. వెస్టిండీస్ వన్డే సిరీస్‌తో పాటు ఇరానీ కప్ జట్టును కూడా అదే సమావేశంలో ఎంపిక చేయనున్నారు. శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. ఆసియా క్రీడల కారణంగా అతడు జపాన్‌లో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. దీంతో వన్డే వైస్ కెప్టెన్సీ రాహుల్‌కు దక్కే అవకాశం ఏర్పడింది. ఇక రెండో వికెట్ కీపర్ ఎంపిక కూడా కీలకంగా మారింది. ఇషాన్ కిషన్ కూడా ఆసియా క్రీడలకు వెళ్లనుండటంతో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్‌లో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

పంత్‌ను భారత జట్టులోకి తీసుకోకపోతే ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు అతడు నాయకత్వం వహించే అవకాశం ఉంది. పంత్‌కు జాతీయ జట్టులో చోటు దక్కితే జురెల్ రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ విషయంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ కీలకం. హార్దిక్ అందుబాటులో లేకపోతే సెలెక్టర్లకు ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. శ్రేయస్ లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది.

ఇరానీ కప్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు సనత్ సంగ్వాన్, ఆయుష్ దోసేజా, రవిచంద్రన్ స్మరణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సెప్టెంబర్ 16న జరిగే సెలక్షన్ సమావేశంతో రాహుల్ వైస్ కెప్టెన్సీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>