కలం, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ తనకు ఒక యుద్ధం లాంటిదని అమెరికన్ టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్(Ben Shelton) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో(Alexander Zverev) జరిగే టైటిల్ పోరులో విజయం కోసం తన శక్తి మొత్తాన్ని కోర్టులో ధారపోస్తానని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో షెల్టన్ ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించి సంచలనం సృష్టించాడు. అనంతరం సెమీఫైనల్లో ఫ్రాన్సిస్ తియాఫోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.
అమెరికన్ టెన్నిస్ అభిమానులు కూడా షెల్టన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. 2003లో ఆండీ రోడిక్ తర్వాత మరో అమెరికన్ ఆటగాడు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవలేదు. దీంతో 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించే అవకాశం ఇప్పుడు షెల్టన్‌కు దక్కింది. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన కుటుంబం, మద్దతుదారుల త్యాగాలు ఎంతో ఉన్నాయని షెల్టన్ పేర్కొన్నాడు. వారందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. అయితే తన లక్ష్యం ఇంకా పూర్తికాలేదని, టైటిల్ గెలవడమే తన ఏకైక ధ్యేయమని స్పష్టం చేశాడు. న్యూయార్క్ ప్రేక్షకుల నుంచి లభించే మద్దతు తనను మరింత ఉత్సాహపరుస్తుందని షెల్టన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జ్వెరెవ్‌తో జరిగే ఈ చారిత్రాత్మక ఫైనల్ పోరు ఈ రాత్రి 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

