దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. సహించేది లేదు: వేముల వీరేశం

కలం, నకిరేకల్: దళిత సమాజాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని, అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులు వెళ్లిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్ లో ధర్నా (Dalit Organizations Protest) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  వేముల వీరేశం (MLA Vemula Veeresham) ముఖ్య అతిథిగా పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిరసన తెలిపిన దళితులను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వంటి ఘటనలు తెలంగాణ సమాజానికే పరాభావమని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి అహంకార పూరిత చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిలబడాలని వేముల వీరేశం పిలుపునిచ్చారు. దళిత సమాజానికి బీఆర్ఎస్ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులు పునరావృతమైతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>