కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్ జోష్ మీద ఉంది. అదే ఉత్సాహంతో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి సొంత కొడంగల్ పరిధిలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ నిర్వహించే తేదీని ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ సభ ద్వారా ఆదివాసీలు, గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా కవిత ప్రణాళికలు రచిస్తున్నారు.
టీఆర్ఎస్‌లోకి నాగోబా ప్రధాన పూజారి..
కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కవిత స్వాగతం పలికి పార్టీ కండువా కప్పారు. ఆనందరావుతో పాటు గిన్నెర సర్పంచి మేస్రం భీంరావు, ముత్తనూరు సర్పంచి రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచి నగేశ్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తాను నాగోబా భక్తురాలినని.. ఎప్పుడూ ఆదిలాబాద్ వెళ్లినా నాగోబాను దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉంటుందన్నారు.

