కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ (GHMC) పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చెత్త సేకరణ పనులను రాంకీ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు కార్మికులను అదుపులోకి తీసుకుని ఎల్బీ స్టేడియానికి తరలించినట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రైవేట్ సంస్థకు పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టు ఇవ్వడం వల్ల తమ ఉపాధిపై ప్రభావం పడుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.
“ప్రైవేటీకరణతో ఉపాధికి ముప్పు”.. కార్మికుల ఆవేదన
ఎల్బీ స్టేడియంలో (LB Stadium) తమను నిర్బంధించిన సమయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని కొందరు కార్మికులు ఆరోపించారు. మహిళా కార్మికుల పట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్ అనే జీవో తీసుకొచ్చి మా జీవితాలను బాగు చేశారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థకు తొత్తుగా మారి మమ్మల్ని అణగదొక్కాలని చూస్తోంది. మా బతుకులపై ఈ ప్రభుత్వం బూడిద చల్లుతోందని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు.
రాంకీ సంస్థకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాన్ని రద్దు చేయాలని, తమతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని కార్మికులు కోరుతున్నారు. మా ప్రాణాలైనా అర్పిస్తాము కానీ మమ్మల్ని ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకోము వారు తెలిపారు. తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కొన్ని కార్మిక సంఘాలు ప్రకటించాయి.

