కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కేరళలో తన పర్యటనను ముగించారు. గత కొన్ని వారాలుగా ఆయుర్వేద చికిత్స కోసం అక్కడ ఉన్న ఆయన పర్యటన ముగింపు సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. కేరళ ప్రజలు చూపించిన ఆప్యాయత, ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తెలిపారు.
వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు
తన చికిత్స విజయవంతంగా సాగేందుకు సహకరించిన డాక్టర్ సీతారాం ఆయుర్వేదిక్ రిట్రీట్ వైద్యులు, యాజమాన్యం, సిబ్బందికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స సమయంలో వారికి ఉన్న అంకితభావం, వృత్తి నైపుణ్యం, వ్యక్తిగత శ్రద్ధ తనకు ఎంతో భరోసానిచ్చాయని పేర్కొన్నారు. కేరళలో (Kerala) గడిపిన సమయం తనకు మానసిక ప్రశాంతతను, స్వస్థతను అందించిందన్నారు.
ప్రభుత్వం, పోలీసులకు ప్రశంసలు
తన పర్యటన సజావుగా సాగేందుకు సహకరించిన కేరళ ప్రభుత్వం, సీఎం వి.డి. సతీశన్‌కు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డీజీపీ, కేరళ పోలీసులతో పాటు త్రిస్సూర్, అలప్పుజ, కొచ్చి జిల్లా పోలీసు బృందాలు, జిల్లా యంత్రాంగం, స్టేట్ ప్రోటోకాల్ విభాగం అందించిన సహకారాన్ని ప్రశంసించారు.
“మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నా”
కేరళ ప్రజల ఆతిథ్యం తన పర్యటనను మరింత ప్రత్యేకంగా మార్చిందని పవన్ పేర్కొన్నారు. వారి ప్రేమ, సద్భావనను ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు. ప్రగాఢమైన కృతజ్ఞత, గౌరవం, మధుర జ్ఞాపకాలతో కేరళ నుంచి బయలుదేరుతున్నానని చెబుతూ.. “థ్యాంక్యూ కేరళం” అంటూ తన సందేశాన్ని ముగించారు.
ప్రముఖ ఆలయాల్లో పవన్ దర్శనం
ఇక, పర్యటనలో భాగంగా త్రిప్రయార్ శ్రీ రామస్వామి, గురువాయూర్ శ్రీ కృష్ణ, మమ్మియూర్ శ్రీ మహాదేవ, చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మ ఆలయాలను సందర్శించినట్లు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాల సంప్రదాయాలు, పవిత్ర వాతావరణం తనకు భక్తి, ప్రశాంతతతో పాటు ఆత్మపరిశీలనకు అవకాశం కల్పించాయని చెప్పారు.

