ముదిగొండలో విషాదం.. బెదిరింపులు తాళలేక యువకుడి బలవన్మరణం!

​కలం, ఖమ్మం బ్యూరో : కేసు ఉపసంహరణ పేరుతో రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ కొందరు వ్యక్తులు పెడుతున్న తీవ్ర వేధింపులు, బెదిరింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు సంచలన విషయాలతో కూడిన సూసైడ్ నోట్ రాయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​స్థానికుల వివరాల ప్రకారం, ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వినయ్ కుమార్ గతంలో ఒక పోక్సో కేసులో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి ఇటీవలె బయటకు వచ్చాడు. అయితే, ఆ కేసును ఉపసంహరించుకోవడానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని కొందరు వ్యక్తులు వినయ్‌ను తీవ్రంగా బెదిరించడమే కాకుండా, అతని వద్ద ఉన్న బైక్, సెల్‌ఫోన్‌ను కూడా బలవంతంగా గుంజుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

​ఆత్మహత్యకు ముందు వినయ్ రాసిన సూసైడ్ నోట్ సంఘటనా స్థలంలో లభ్యమైంది. కొందరు వ్యక్తులు రూ.20 లక్షలు ఇవ్వాలంటూ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని వినయ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. “డబ్బులు అంటే మాటలు కావు” అని తన ఆవేదనను వ్యక్తపరుస్తూ, తల్లిదండ్రులు, స్థానిక సీఐ ని ఉద్దేశించి ఆ లేఖ రాసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

​ఈ దారుణమైన వేధింపుల కారణంగానే మనస్తాపం చెంది వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మృతికి కారణమైన వారిపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Also Read : ప్రపంచ శాంతి, సమానత్వమే లక్ష్యం: బ్రిక్స్ కూటమి సంచలన నిర్ణయాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>