కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలు, సమయపాలన లేకపోవడం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ (TGSPDCL CMD) జి. జితేష్ వి. పాటిల్ (Jitesh V Patil) ను భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది.
దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ ముఖాముఖి సమావేశంలో క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను, ముఖ్యంగా ప్రస్తుత దశలో వరి పంటకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉన్న తీరును సీఎండీ (TGSPDCL CMD) దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధి బృందం లేవనెత్తిన ప్రధానాంశాలు గమనిస్తే.. గ్రామాల్లో వ్యవసాయానికి నిర్ణీత వేళల్లో కరెంట్ రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పంట చేతికి వచ్చే కీలక సమయంలో సరైన విద్యుత్ సరఫరా లేకపోతే వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉందని అందులో పేర్కొన్నారు. అప్రకటిత కోతలను నివారించి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని కోరారు.
స్పందించిన సీఎండీ
సీఎండీ ఈ విషయమై స్పందించారు. రైతుల సమస్యలను సావధానంగా విన్న సీఎండీ పరిస్థితిని సానుకూలంగా అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు రోజులుగానే సాంకేతిక కారణాలు, డిమాండ్ పెరుగుదల వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. సమస్య పరిష్కారానికి సంస్థ చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా ఎక్కడ లభ్యమైనా అక్కడి నుంచి అదనపు విద్యుత్‌ను పొంది సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పరిస్థితిని చక్కదిద్ది, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BKS ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, సాదినేని రవీందర్, సుబ్బారెడ్డి, వినోద్ కుమార్, భాగ్యనగర్ జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : మంచం మీద నుంచే మైండ్ గేమ్: ఫిరూజ్జా దెబ్బకు చెస్ వరల్డ్ షాక్!
Follow Us On : WhatsApp

