కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao)పై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాల నిషేధిత భూములను తన తండ్రి పేరు మీదకు అక్రమంగా బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, దమ్ముంటే విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క.. ఇద్దరూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. దమ్ముంటే చర్చ పెట్టాలని సూచించారు.
‘బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు’..
రాష్ట్రంలో బ్లాక్ మెయిలర్ల సంఘం పెడితే.. దానికి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి రూ.వేల కోట్లు పోగేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి తనను తాను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే దందాలు, కబ్జాలు, బెదిరింపులు గుర్తుకు వస్తాయని.. అలాంటి వ్యక్తి తాను పెద్ద స్వాతిముత్యం అంటూ డైలాగులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మంచం మీద నుంచే మైండ్ గేమ్: ఫిరూజ్జా దెబ్బకు చెస్ వరల్డ్ షాక్!
Follow Us On : WhatsApp

