కలం, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ (BRS Mock Assembly) నిర్వహిస్తోంది. సీఎం పాత్రలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులుగా గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులుగా కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. స్పీకర్గా మాణిక్య రావు ఉన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. మాక్ అసెంబ్లీ సీఎం తలసాని మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరా గాంధీ కట్టించారని, 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు అడిగినప్పుడు నీళ్లు విడుదల చేయమమని.. తమకు ఇష్టం వచ్చినప్పుడే మోటార్లు ఆన్ చేస్తామన్నారు.
నేను ప్రిపేర్ అయి రాలేదు..
మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులు బేసిన్లు, టీఎంసీలు అంటూ మాట్లాడుతున్నారని.. వాటి గురించి తనకు తెలియదన్నారు. ఆదిత్యనాథ్ దాస్ సలహాల ప్రకారమే నడుచుకోవడం తెలుసన్నారు. గట్టిగా అడిగితే తాను ఇంకా ప్రిపేర్ అయి రాలేదన్నారు. రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తున్న గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నిషేధిత భూముల్లో తనకు ఒక్కరికే వాటా ఉన్నట్లు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదన్నారు. సీఎంకు వాటా లేదా.. ఆయన్ను ఎందుకు అడగరని ప్రశ్నించారు.

