కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ (Akkapur) గ్రామంలోని 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను (KV Substation) టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి (CMD Varun Reddy) శుక్రవారం పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా, లోడ్ పరిస్థితి, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల పనితీరును సీఎండీ పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి రైతులకు అందుతున్న వ్యవసాయ విద్యుత్ సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా అక్కాపూర్ సబ్‌స్టేషన్‌కు కొత్తగా 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేశామన్నారు.
అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు ఆదేశాలు
కాలిపోయిన 50 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినందున దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని వ్యవసాయ రంగానికి నిరంతరాయ విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ట్రాన్స్‌ఫార్మర్‌పై అయినా అధిక లోడ్ నమోదైతే వెంటనే పరిస్థితిని సమీక్షించి అవసరమైన చోట అదనపు లేదా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాల వద్ద విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
విద్యుత్ లైన్లకు సమీపంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్‌స్టేషన్లలోని కెపాసిటర్ బ్యాంకులను సమర్థంగా వినియోగించి పవర్ ఫ్యాక్టర్‌ను మెరుగైన స్థాయిలో నిర్వహించాలని సూచించారు. వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్నిపెంచాలని ఈ సందర్భంగా సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి తెలిపారు.

