కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ దవాఖానా అనగానే మౌలిక వసతుల కొరత, పరికరాల లేమి, రోగుల అవస్థలే గుర్తుకొస్తాయి. కానీ.. ఆ పాత ముద్రను తుడిచిపెడుతూ ఖమ్మం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో (Khammam Hospital) కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో ఆసుపత్రి రూపురేఖలు మారుతున్నాయి. అత్యున్నత స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.
పోర్టబుల్ యంత్రాలు
ఆసుపత్రి(Khammam Hospital)లోని అత్యవసర సేవల విభాగంలో తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్న రోగులకు ఇబ్బంది లేకుండా వారి వద్దకే వచ్చి స్కానింగ్‌లు చేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా మూడు పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రాలు, పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారికి, అత్యవసర విభాగంలోని రోగులకు సమయం వృథా కాకుండా తక్షణమే నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం కలుగుతోంది.
త్వరలో ఎంఆర్‌ఐ సేవలు
దీనికితోడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయ్యే ఎంఆర్‌ఐ స్కాన్ సేవలు కూడా త్వరలో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు, సివిల్ నిర్మాణాలను కలెక్టర్ దివాకర టి.ఎస్. స్వయంగా పర్యవేక్షిస్తూ శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. అలాగే రక్తనాళాల్లోని అడ్డంకులను గుర్తించే కలర్ డాప్లర్, పగలు, రాత్రి నిరంతరాయంగా పనిచేసే కాంట్రాస్ట్, హెచ్‌ఆర్ సీటీ స్కాన్లు అందుబాటులో ఉండటంతో పేద రోగులు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోతోంది.
ఎక్స్‌పర్ట్స్‌తో సేవలు మెరుగు
పరికరాల లభ్యతతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేందర్, డాక్టర్ మురళీకృష్ణ వంటి రేడియాలజీ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించడంతో మరింత మెరుగైన సేవలు అందుతున్నాయి. కేవలం యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, వాటి సేవలు ప్రజలకు నిరంతరాయంగా అందేలా వ్యూహాత్మకంగా పర్యవేక్షిస్తుండటంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.
గర్భిణులకు టిఫ్ఫా స్కాన్ ఉచితం
మరోవైపు మాతా-శిశు సంరక్షణ విభాగం గర్భిణులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో దాదాపు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేసే కీలకమైన టిఫ్ఫా స్కాన్ను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. పిండంలో అవయవాల అభివృద్ధిలో లోపాలను గుర్తించేందుకు, తగిన వైద్య ప్రణాళిక రూపొందించుకోవడానికి ఈ స్కాన్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య ఏకంగా 546 టిఫ్ఫా స్కాన్లు, 16,961 మాతా-శిశు స్కాన్లు నిర్వహించడం సేవల విస్తరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read : బ్రిక్స్ సదస్సులో డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన
Follow Us On : WhatsApp

