ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ ఆదేశాలు

కలం, జోగులాంబ గద్వాల: సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ (Gadwal Collector)  రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం అతిథులకు ఆహ్వానాలు పంపడంతో పాటు జాతీయ పతాకావిష్కరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కలెక్టరేట్ ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్నందున టెంట్లు, బారికేడ్లు, స్టేజ్ అలంకరణ, పారిశుధ్యం, తాగునీరు, ఫైర్ సేఫ్టీ, వైద్య శిబిరం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాలు, మండలాల్లోనూ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలిపారు.

మట్టి వినాయకులనే పూజించాలి

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అధికారులు మట్టి వినాయకులను పూజించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మట్టి వినాయకుల ప్రాధాన్యతపై రూపొందించిన గోడపత్రికలు, మట్టి విగ్రహాలను ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పలువురు అధికారులు, కలెక్టరేట్ సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో మంజుల, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>