కలం, నిర్మల్ : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్ సమావేశమై ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు.
రోజువారీగా నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, రేడియాలజీ, ఈఎన్‌టీ తదితర విభాగాల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సలకు అవసరమైన యంత్రాల వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి సేకరించారు.
అవసరమైన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా వైద్య సేవలు అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, అధికారులు రమేశ్, సరోజ, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

