ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి కొత్త డిజిటల్‌ విధానం

కలం, వెబ్ డెస్క్: హైవేలపై టోల్‌ చెల్లింపుల విధానంలో మరో కీలక మార్పు రానుంది. వాహనాలు టోల్‌ ప్లాజాల (Toll plazas) వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్‌ విధానంలో రుసుము వసూలు చేసే వ్యవస్థను (Barrier Free Toll System) తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలోగా ఈ కొత్త విధానం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఫాస్టాగ్‌తో నంబర్‌ప్లేట్‌ గుర్తింపు

ముంబైలో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026’లో గడ్కరీ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్‌ విధానానికి వాహనాల నంబర్‌ప్లేట్‌ గుర్తింపు సాంకేతికతను అనుసంధానించనున్నట్లు తెలిపారు. వాహనం టోల్‌ ప్రాంతం గుండా వెళ్లే సమయంలో ఫాస్టాగ్‌, నంబర్‌ప్లేట్‌ వివరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించి టోల్‌ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా వసూలు చేసేలా (Barrier Free Toll System) వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఏటా రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయం?

కొత్త డిజిటల్‌ విధానం అమల్లోకి వస్తే టోల్‌ వసూళ్లు మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.10 వేల కోట్ల మేర అదనపు టోల్‌ ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. టోల్‌ చెల్లింపు కోసం వాహనాలు నిలిచిపోకుండా నేరుగా వెళ్లగలగడంతో ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని వివరించారు.

ఇప్పటికే 80-90 శాతం తగ్గిన నిరీక్షణ

ఫాస్టాగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయం ఇప్పటికే 80 నుంచి 90 శాతం వరకు తగ్గిందని మంత్రి తెలిపారు. గతంలో కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు 12 నిమిషాల వరకు వేచి ఉండేవారని కొన్ని సందర్భాల్లో ఈ నిరీక్షణ 30 నిమిషాల వరకు చేరేదని గుర్తుచేశారు. సాంకేతికతను మరింత విస్తరించడం ద్వారా మిగిలిన ఆలస్యాన్ని కూడా తొలగించనున్నట్లు చెప్పారు.

2016లో ఫాస్టాగ్‌.. ఇప్పుడు మరో అడుగు

దేశంలో ఫాస్టాగ్‌ విధానాన్ని 2016లో ప్రవేశపెట్టగా 2021 నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేశారు. టోల్‌ ప్లాజాను వాహనం దాటిన వెంటనే అనుసంధానిత ఖాతా నుంచి రుసుము ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. దీంతో నగదు చెల్లింపులు, చిల్లర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గి టోల్‌ వసూళ్లు వేగవంతమయ్యాయి. ఇప్పుడు తదుపరి దశలో టోల్‌ ప్లాజాల వద్ద అడ్డంకులు లేకుండా వాహనాలు నిరంతరాయంగా వెళ్లేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే హైవే ప్రయాణంలో సమయం ఆదా కావడంతో పాటు టోల్‌ వసూళ్ల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

Also Read : పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>