కలం, కరీంనగర్: ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం చట్టప్రకారం అందించాల్సిన ఎక్స్‌గ్రేషియా/పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని కేవీపీఎస్ (KVPS) కరీంనగర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలపై జరిగిన దాడులు, వివక్ష, అవమానాలు, ఇతర నేరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఆయా కేసుల్లో బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారం గత రెండు–మూడు సంవత్సరాలుగా అనేక కేసుల్లో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే నేరాలకు గురై ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం వల్ల వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో సుమారు 180 మంది ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు చట్టప్రకారం అందాల్సిన ఎక్స్‌గ్రేషియా/పరిహారం ఇంకా పూర్తిగా అందలేదని తెలిపారు. కేసు నమోదైన దశ, దర్యాప్తు, చార్జిషీట్, విచారణ తదితర అర్హత దశలకు అనుగుణంగా చెల్లించాల్సిన పరిహారం పెండింగ్‌లో ఉండటం బాధితుల హక్కులకు విఘాతం కలిగిస్తోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే నేరాలను నిరోధించడంతో పాటు బాధితులకు తక్షణ రక్షణ కల్పించడం, వారికి చట్టబద్ధంగా అందాల్సిన పరిహారం సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కేవీపీఎస్ నగర కార్యదర్శి గాజుల కనకరాజ్. పులుపాక సాయికుమార్, సంకీర్త్ , బొడ్డు చందు, నాయకులు సురేష్ ఉన్నారు.
Also Read : పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చ
Follow Us On: X(Twitter)

