కలం, నాగర్ కర్నూల్: రైతులకు సాగునీరు (Irrigation water) బందు చేస్తే లిఫ్టుల వద్దనే వంటావార్పు పెట్టి రైతులతో కలిసి శిబిరం వేసి ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి రైతులకు పంటలు పండించేదాకా వదలమని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులు భారీ ఎత్తున నాగర్ కర్నూల్ (Nagarkurnool) నియోజకవర్గంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు గుడిపల్లి రిజర్వాయర్ (Gudipalli Reservoir) మూడవ లిఫ్టును ఆకస్మికంగా పరిశీలించారు.
రైతుల నీటి సమస్యను పట్టించుకోవడం లేదు
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని, శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో నీరు ఉన్న ఇచ్చే తెలివి, అవగాహన లేక నీటిని నింపడం లేదని ఆరోపించారు. రైతుల మీద నీటి మీద ధ్యాస లేదని కేవలం ఫోర్త్ సిటీ ఫోర్త్ బ్రదర్స్ మీదనే ధ్యాస ఉందని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం మొండికేసిందని, చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ఈ లిఫ్ట్ ద్వారానే ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కాలువ ద్వారా వెళ్లాలని అక్కడ కూడా నీటి లేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి సిగ్గుపడాలని, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉందా అని, కృష్ణానదిలో రాళ్లు కట్టుకొని దూకాలని నిరంజన్ రెడ్డి అపహస్యం చేశారు. రైతులకు సాగునీరు ఆపివేస్తే అన్ని లిఫ్టుల వద్ద ఆందోళన చేద్దామని పిలుపునిచ్చారు.
ఏపీకి నీళ్లు.. తెలంగాణ రైతులకు అన్యాయమా?
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి ఆంధ్రకు నీళ్లు తరలిస్తున్నారని, తెలంగాణకు నీళ్లు ఎండబెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం వస్తుందని, తెలంగాణకు ఏడు టీఎంసీల నీళ్లు మాత్రమే ఇస్తున్నారని 70 టీఎంసీల నీళ్లు ఆంధ్రకు తరలిస్తున్నా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముల్లు కర్ర గుచ్చి లేపితేనే ఈ ప్రభుత్వం లేస్తున్నదని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. 24 గంటలు సరఫరా చేస్తామన్న విద్యుత్తు చేయడం లేదని ఆరోపించారు. పంటలు ఎండిపోతే రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
పంటలు ఎండితే ప్రభుత్వమే బాధ్యత
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గమైన ప్రభుత్వం అని సీఎం పర్యటన చేసిన ఫలితం లేదని ఈ ప్రభుత్వానికి నీటి సరఫరా పై అవగాహన లేదని ఆరోపించారు. తెలివిలేని దద్దమ్మల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామని నీటిని బంద్ చేస్తే ఆగేది లేదని లిఫ్ట్ వద్దనే వంటావార్పు చేసి శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేద్దామని, సాగునీరు ద్వారా పంటలు పండించేంతవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మోటార్ల మరమ్మతులపై నిర్లక్ష్యమంటూ విమర్శలు
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లూరు రిజర్వాయర్ వద్ద ఒక మోటారు చెడిపోయిన పట్టించుకునే పరిస్థితి మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేదని విమర్శించారు. రైతులను గొంతు కోస్తున్నదని నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని, నీటి సరఫరా చేయడం లేదని వివరించారు. రైతులకు అండగా ఉంటామని రైతుల గోస పట్టించుకుంటామని, సంఘటితంగా పోరాటం చేసి నీటిని సరఫరా చేసేంతవరకు వదిలేది లేదని అన్నారు.
Also Read : నాలుగేళ్ల చిన్నారిపై కరెస్పాండెంట్ అఘాయిత్యం
Follow Us On : WhatsApp

