కలం, మెదక్ బ్యూరో: దళితులను బీఆర్ఎస్ ఘోరంగా అవమానించిందని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jagga Reddy) విమర్శించారు. దళితులు నడిచారనే నెపంతో నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఆ పార్టీ అనాగరిక చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వైఖరి నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శుక్రవారం నిరసన చేపట్టారు. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసులపైనే దాడులు..
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, బీఆర్ఎస్ నాయకులు అరాచకానికి పాల్పడటం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమను తామే నెట్టుకుంటూ.. పోలీసులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
దళిత వర్గాన్ని అవమానిస్తూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను, చర్యలను రాష్ట్ర ప్రజలు గమనించారని నిర్మలా జగ్గారెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దళితులు, చట్టసభలను అవమానిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

