కలం, నిర్మల్ : బీసీల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ (Amaraveni Narsagoud) మండిపడ్డారు. జనగణనలో బీసీ కులగణన (BC Caste Census) చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం బీసీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపడతామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మాట తప్పుతోందని ఆరోపించారు.
బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
ఎస్సీ, ఎస్టీలకు జనగణనలో ప్రత్యేక కాలమ్ ఉన్నట్లే బీసీలకు కూడా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, వారి జనాభాను ఖచ్చితంగా లెక్కించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. బీసీలను మోసం చేస్తే బీజేపీ పతనం తప్పదని హెచ్చరించారు.

