కలం, జగిత్యాల: అప్రకటిత విద్యుత్ కోతలు, తరచూ ఏర్పడుతున్న లో-వోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తూ జగిత్యాల (Jagtial) రూరల్ మండలం చల్గల్ (Chelgal) గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చల్గల్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట జగిత్యాల – నిజామాబాద్ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా, ముట్టడి (Farmers Protest) చేపట్టారు. గ్రామంలోని పలువురు రైతులు పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్ వద్దకు చేరుకుని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
లో-వోల్టేజీతో మోటార్లు పనిచేయడం లేదు
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం వరి పంటకు సాగునీరు అత్యవసరంగా ఉన్న సమయంలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు సరఫరా ఉన్న సమయంలోనూ వోల్టేజీ సరిగా లేక మోటార్లు పనిచేయడం లేదని రైతులు తెలిపారు. దీంతో బోర్ల నుంచి నీటిని పొలాలకు పంపింగ్ చేయలేకపోతున్నామని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతుకు ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు పెట్టాం.. పంటలు కాపాడాలి
పంట సాగు కోసం ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు విద్యుత్ సమస్యల కారణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. విద్యుత్ శాఖ అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయాలని వారు కోరారు. రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల ధర్నాతో కొంతసేపు సబ్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యుత్ సరఫరా సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

