కలం, తెలంగాణ బ్యూరో: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ (BRS Assembly Strategy) ఏదో చేయాలనుకున్నది.. ఇంకేదో జరిగిపోయింది.. ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనుకుని చివరకు చిక్కుల్లో చిక్కుకున్నది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను అసెంబ్లీలో ఎండగట్టాలని పకడ్బందీ ప్రణాళిక రూపొందుంచుకున్నప్పటికీ, మొదటి రోజునే అది బెడిసికొట్టింది. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ 23 పేజీలతో చార్జ్‌షీట్ రూపొందించి అసెంబ్లీ వేదికగానే నిలదీయాలనుకున్న వ్యూహం రివర్స్ అయింది.
బ్లాక్ టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులపై దాడులకు దిగడం.. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఎర్రవల్లిలో దళితులు ‘చావు డప్పు’ మోగించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం.. ఇలాంటి సంఘటనలతో బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అటు ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇటు 22 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో పార్టీ పరువు పోయింది. కాంగ్రెస్‌ను కార్నర్ చేయబోయి, చివరకు బీఆర్ఎస్సే బొక్కాబోర్లా పడ్డది. ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ తక్షణ కర్తవ్యంగా మారింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వెయ్యి రోజుల పాలనలోని విజయాలను ఏకరువు పెట్టాలని, విపక్షాల నోరు మూయించాలని అధికార పార్టీ భావించింది. పదేండ్ల పాలనలోని వైఫల్యాలను ప్రస్తావించి బీఆర్ఎస్‌ను నిలదీయాలని ప్లాన్ చేసుకున్నది. అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమల్లోని డొల్లతనాన్ని నిలదీస్తామని, ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా చేస్తామని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు గంభీర ప్రకటనలు చేశారు.
ఒక్కో అంశానికి సంబంధించిన గణాంకాలను, వివరాలను, ఆధారాలను రెడీ చేసి పెట్టుకున్నామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, నిషేధిత భూముల జాబితా (22ఏ).. ఇలాంటి అనేక అంశాలను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేసుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పకడ్బందీ వ్యూహాలు రచించారు. కానీ అవేవీ అసెంబ్లీ సమావేశాల్లో సాకారం కాలేదు. తొలి రోజే మొత్తం బెడిసికొట్టడం ఆ పార్టీని ఊహించనంతగా డీమోరల్ చేసింది.
దళిత వ్యతిరేక చర్యలతో సీన్ రివర్స్
బ్లాక్ టీషర్టులతో అసెంబ్లీకి రావడం.. పోలీసులు అడ్డుకోవడం.. వీటితో మీడియాలో హైప్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసినట్లుగానే ఫలితాలు వచ్చాయి. అదే టైమ్‌లో స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కామెంట్లతో మొత్తం సీన్ మారిపోయిందని, తాము అనుకున్నదంతా రివర్స్ అయిందన్నది బీఆర్ఎస్ లీడర్ల భావన. తాతా మధు కామెంట్లు చేయకపోయి ఉంటే చిక్కులే వచ్చి ఉండేవి కాదన్నది వాళ్ల అభిప్రాయం. తాతా మధు వ్యాఖ్యలతో సమాధానం చెప్పుకోలేని డైలమాలో పడాల్సి వచ్చిందని, చివరకు కేసీఆర్ ఆదేశాలతో తాతా మధు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.
దీనికి తోడు మరుసటి రోజు ఎర్రవల్లిలో దళిత కళాకారుల డప్పు ర్యాలీ అనంతరం రోడ్లను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం పార్టీకి మరింత డ్యామేజ్ చేసిందన్నది వారి వాదన. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టులో బెయిల్ రావడం ప్రభుత్వానికి నెగెటివ్ అయినా.. పసుపు నీళ్ల శుద్ధి కార్యక్రమం ఆ సానుకూల వాతావరణాన్ని చెడగొట్టి ఇంకొంత దెబ్బ కొట్టిందన్న అభిప్రాయం గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నది.
డ్యామేజ్ కంట్రోల్ భారీ టాస్క్
దళితుల అంశంలో బీఆర్ఎస్‌కు ఏర్పడిన మచ్చను పోగొట్టుకోవడం వెంటనే జరిగే పని కాదని, మళ్లీ ప్రజల కాన్ఫిడెన్స్ పొందడానికి చాలా కాలమే పడుతుందన్నది గులాబీ నేతల అభిప్రాయం. తాతా మధు కామెంట్లు, పసుపు నీళ్ల శుద్ధి కార్యక్రమం.. ఈ రెండూ అనూహ్యంగా జరిగిన పరిణామాలేనని, కానీ వీటితో జరిగిన డ్యామేజీ మామూలు స్థాయిలో లేదని, సెంటిమెంటల్ ఇష్యూగా ప్రజల్లో వ్యాప్తి చెందిందని ఓ బీఆర్ఎస్ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత వ్యతిరేకి అని ఏర్పడిన ముద్ర లేదా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే చాలా వ్యూహాత్మకంగా, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి కష్టపడాల్సి ఉంటుందని.. ఒక్క రోజుతో జరిగిన డ్యామేజీని పూడ్చుకోడానికి ఏడాది కాలం పట్టినా ఆశ్చర్యం లేదన్నది ఆ నేత భావన. తొలి రోజున అసెంబ్లీ దగ్గర జరిగిన బ్లాక్ టీషర్టుల నిరసన సందర్భంగా ఒక పథకం ప్రకారమే గంగుల కమలాకర్‌కు కేటీఆర్ కను సైగ చేయడం, ఆ పార్టీకే చెందిన మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మెడను నెట్టివేయడం, వారిని తోసేయడం, పోలీసులతో జరిగిన తోపులాట.. ఇవన్నీ వీడియో ఫుటేజ్‌లో బయటపడడంతో దాన్ని సరిదిద్దుకోవడం శక్తికి మించిన పనిగా మారింది.
అంచనాలన్నీ తలకిందులు
గత సమావేశాల సందర్భంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలని, బడ్జెట్‌లోని లెక్కలతో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ లెక్కలు వేసుకున్నా అది నెరవేరలేదు. అప్పుడు కూడా వాకౌట్‌లు, బాయ్‌కాట్‌లు, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం.. వీటితో అనుకున్న టాస్క్ నెరవేరలేదన్న అభిప్రాయం ఉన్నది.
ఈసారి సెషన్ సందర్భంగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూనే ప్రభుత్వ హామీల అమలులోని డొల్లతనాన్ని అసెంబ్లీ వేదికగానే ఎక్స్‌పోజ్ చేసే అవకాశాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని భావించినప్పటికీ మొదటి రోజునే బెడిసికొట్టింది. సభలో అనుసరించాల్సిన విధానంపై వ్యూహాత్మకంగా వ్యవహరించేలా కేసీఆర్ దిశానిర్దేశం చేసినా.. తాతా మధు వ్యాఖ్యలతో మొత్తం రివర్స్ అయింది.
నిమిషాల వ్యవధిలోనే ఆ కామెంట్‌ను సీఎం గ్రహించడం, ఎమ్మెల్యేలకు పాస్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. సమాధానం చెప్పుకోలేని డిఫెన్సులో పడింది. వ్యాఖ్యలను సమర్ధించుకోలేక, వ్యతిరేకించలేక ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. తరహాలో ఇరుక్కుపోయింది. ఈ డ్యామేజ్ నుంచి బయటపడడం ఇప్పుడు బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారింది.

