కలం, కోరుట్ల: కోరుట్ల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, జూవ్వాడి కుటుంబం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జూవ్వాడి నర్సింగరావు (Juvvadi Narsing Rao) అన్నారు. కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి జూవ్వాడి నర్సింగరావు కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణానికి 8 కిలోమీటర్ల పరిధిలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో 2025 మార్చి 31 నాటికి ఈఎంఆర్ రికార్డుల ప్రకారం 4,141 మంది బీమా పొందిన వ్యక్తులు ఉన్నారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య 5,086కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈఎస్ఐసీ ప్రధాన కార్యాలయం 2022 జూలై 11న జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం కోరుట్ల క్యాచ్మెంట్ ప్రాంతం ముగ్గురు వైద్యులతో కూడిన ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన ప్రమాణాలను కలిగి ఉందని జూవ్వాడి నర్సింగరావు తెలిపారు. డిస్పెన్సరీ ఏర్పాటుతో పేద కార్మికులు, బీమా పొందిన కుటుంబాలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు.
రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహాలక్ష్మి పథకం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందని నర్సింగరావు తెలిపారు. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కి చిరునామా జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధిని నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు కూడా కృషి
కోరుట్లలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, త్వరలోనే దానిని కూడా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని జూవ్వాడి నర్సింగరావు తెలిపారు. పట్టణంలో అవసరమైన మౌలిక వసతులు, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సేవలను తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
అక్రమ అరెస్టులు బీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య
కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, అక్రమ అరెస్టులు చేయడం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని అణచివేసే విధానాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదన్నారు. రాజకీయ కక్షలకు తావులేకుండా ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోరుట్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జూవ్వాడి నర్సింగరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహెద్ ఉల్ అహద్, అన్న అనిల్, కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లు, తదితర నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

