కలం, జోగులాంబ గద్వాల: వివాహానికి సిద్ధంగా ఉన్న యువతులకు, ఆర్యవైశ్య యువకులకు వివాహ సంబంధాలు (Arya Vaishya Marriage) ఏర్పాటు చేసేందుకు గద్వాల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించినట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.
ఈ మేరకు గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క (Seethakka)ను, కమిషనర్/డైరెక్టర్ శృతి ఓజ ఐఏఎస్‌ను కలిసి వినతి చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివాహానికి సిద్ధంగా ఉన్న యువతులకు, గద్వాల్ పట్టణ ఆర్యవైశ్య యువకులకు వివాహ సంబంధాలు ఏర్పాటుచేసేందుకు సహకరించాలని కోరారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ, ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన గద్వాల్ పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని అభినందించారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న యువకుల పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను సిద్ధం చేసుకుని కొద్ది రోజుల్లో మరోసారి కలవాలని సూచించారు.
అనంతరం మంచి రోజు చూసి వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించి, సంబంధాలను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపడదామని మంత్రి సీతక్క పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య యువకులు పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న పట్టణ యువకులు తమ పూర్తి బయోడేటాతో సంప్రదించవలసిందిగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి ఆలూరు బిలకంటి రాము కోరారు.

