కలం, నిర్మల్ : బాసరలో గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టి, పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం సాయంత్రం బాసర ఈవో కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాలకు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు కోసం ఏఐ సాంకేతికతను వినియోగించాలని తెలిపారు.
పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్సులు, హెలిప్యాడ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. చేపట్టే పనులను ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతామని, తగినంత మంది పోలీసు సిబ్బందిని కేటాయించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

