కలం, కరీంనగర్: తెలంగాణ పౌరుషా నికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) అని ఆమె పోరాట స్ఫూర్తి ని కొనసాగిద్దామని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కలెక్టర్ రోడ్డు లోని చాకలి అయిలమ్మ విగ్రహం కూడలి లో నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పేద బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కులకై పోరాడి ఆమె చూపిన ధైర్యం,తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని రామారావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు జంపాల నర్సయ్య, ప్రజా సంఘాల జిల్లా నాయకులు అండెం రమణా రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, గడ్డం కనకయ్య, బోయినపల్లి శ్రీనివాస్ రావు ఉన్నారు.

