కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పరాగ్వే దేశం అసున్సియోన్‌లో అక్టోబర్ 2 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు భారత జట్టుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కోడుగంటి భరత్ చంద్ర (Mahabubnagar Skater Bharat Chandra ) ఎంపికయ్యారు. ఈ మేరకు భరత్ కు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా రూ.2,52,250 ఆర్థిక సహాయం అందించారు.
రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన భారత జట్టులో తెలంగాణ రాష్ట్రం నుంచి భరత్ చంద్రకు చోటు లభించింది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత తనకు లేదని, సహాయం అందించాలని భరత్ చంద్ర కలెక్టర్‌ను అభ్యర్థించారు.
భరత్ చంద్ర పరాగ్వే వెళ్లి ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు రూ.5,05,000 ఖర్చవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన కలెక్టర్ జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి మొత్తం ఖర్చులు 50 శాతం ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో భరత్ చంద్రకు రూ.2,52,250 చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భరత్ చంద్ర ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి, మహబూబ్‌నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, DRDO నిర్మల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

