కలం, స్పోర్ట్స్ : కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల హర్డ్లర్ కృషిక్ ఎంకు (Krishik Manjunath) ఆసియన్ గేమ్స్ (Asian Games 2026) భారత జట్టులో చోటు దక్కలేదు. మూడుసార్లు అర్హత ప్రమాణాలను అధిగమించినా సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టారు. ఈ నిర్ణయంతో క్రీడాకారుడు, అతడి కుటుంబం తీవ్ర నిరాశకు గురయ్యారు. సీజన్ ఆరంభం నుంచి కృషిక్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఏఎఫ్‌ఐ నిర్ణయించిన 13.63 సెకన్ల సమయాన్ని మూడుసార్లు అధిగమించాడు. మే నెలలో చెన్నైలో 13.44 సెకన్లు, రాంచీలో 13.52 సెకన్లు, జూన్‌లో లూథియానాలో 13.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. అయినప్పటికీ జట్టు ఎంపికలో అతడి పేరు కనిపించలేదు. భువనేశ్వర్‌లో జరిగిన ఇంటర్-స్టేట్ మీట్‌లో కృషిక్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికే అవకాశం ఇస్తామని ఏఎఫ్‌ఐ స్పష్టం చేసింది.
తుది రేసులో మూడుసార్లు ఫాల్స్ స్టార్ట్స్ కావడం వల్ల ఒత్తిడికి గురై మూడో స్థానానికి పరిమితమయ్యానని కృషిక్ పేర్కొన్నాడు. జాతీయ సమాఖ్యకు విన్నవించినా ఎంపిక మండలి అందుకు అంగీకరించలేదు. జట్టుకు ఎంపికైన తేజస్ షిర్సే గాయంతో తప్పుకున్నా ఏఎఫ్‌ఐ కృషిక్‌ను పిలవలేదు. ఇతర సీనియర్ అథ్లెట్లకు ఇచ్చిన మినహాయింపును కృషిక్‌కు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసియాలో 7వ ర్యాంక్‌లో ఉన్న కృషిక్, న్యూఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో గెలిచి తన సత్తా చాటుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

