కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ (Miryalaguda) నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, స్థానిక యువత ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshma Reddy) అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశాల్లో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల తరఫున పలు కీలక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా నియోజకవర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ.. మిర్యాలగూడ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని గుర్తుచేశారు.
వ్యవసాయ విద్యకు కొత్త వేదిక
ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, యాంత్రీకరణపై యువతకు సమగ్రమైన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
రెండు కళాశాలలకు వెంటనే మంజూరు
నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు కలిగిన యువతకే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు వివిధ రంగాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రెండు కళాశాలలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు.

