కలం, ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి (Chakali Ilamma Death Anniversary) సందర్భంగా గురువారం ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఐలమ్మ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాడు భూస్వామ్య వ్యవస్థకు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
మహిళా శక్తికి ప్రతీకగా ఐలమ్మ
తన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రను ప్రపంచానికి చాటిచెప్పిన ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

