భద్రాద్రిలో బౌద్ధ వైభవం.. రామావరం గుహలు, కారుకొండ చెరువుకు మహర్దశ!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాచీన బౌద్ధ వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక క్షేత్రాలు త్వరలోనే పర్యాటక కాంతులతో అలరారనున్నాయి. జిల్లాలోని కారుకొండ రామావరం బౌద్ధ గుహలు (Buddhist Caves), ధ్యాన మందిరంతో పాటు సమీపంలోని కారుకొండ చెరువుకు మహర్దశ పట్టనుంది. ఈ ప్రాచీన వారసత్వ ప్రదేశాలను పర్యాటకంగా విశేషంగా ఆకట్టుకునేలా సుందరీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాబోయే సెప్టెంబర్ 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ వేడుకలను ఈ కారుకొండ బౌద్ధ గుహల వద్ద ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

​ఈ సందర్భంగా పర్యాటక రంగ (టూరిజం) నోడల్ అధికారి అనూష గురువారం క్షేత్రస్థాయిలో ఈ చారిత్రక గుహలను (Buddhist Caves) సందర్శించి పరిశీలించారు. గుహల నిర్మాణ శైలిని, పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం, అక్కడ లభించిన చారిత్రక ఆధారాల విశేషాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.​ అనంతరం నోడల్ అధికారి అనూష (Nodal Officer Anusha) మాట్లాడుతూ… జిల్లాలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపదను పరిరక్షిస్తూనే, వాటికి పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 27న జరిగే పర్యాటక ఉత్సవాలకు కావాల్సిన అన్ని ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.

పర్యాటకుల సౌకర్యార్థం రహదారి సౌకర్యాలు, తాగునీరు, సమాచార కేంద్రాలు వంటి ప్రాథమిక మౌలిక వసతులను కల్పించడంతో పాటు కారుకొండ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాను రాష్ట్ర పర్యాటక మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>