స్పీకర్‌ను అవమానిస్తే సహించం: కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం

కలం, వనపర్తి: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను వెంటనే పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం (Congress SC Wing) జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. వారిపై రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో సంఘీభావ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌ మాట్లాడుతూ.. శాసనసభ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడంతోపాటు మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా ఉన్న శాసనసభలోనే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని చెప్పారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహారశైలిని ప్రజల ముందు ఎండగడతామని రాజ్‌కుమార్‌ అన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పద్ధతుల్లోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శులు ఐ.సత్యరెడ్డి, బ్రహ్మచారి, బి.కృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అత్తం రవికుమార్‌, మండల అధ్యక్షులు వెంకటస్వామి, నరహరి, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు, శ్రీను, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సూరి, సురేష్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు విశ్వంబాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>