కోదాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ అరెస్ట్

కలం, సూర్యాపేట: కోదాడ పట్టణంలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ దొంగను (Serial Burglar) పట్టణ పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన 37.2 తులాల బంగారు ఆభరణాలు, 470 గ్రాముల వెండి వస్తువులు, రూ. 3.60 లక్షల నగదు, దొంగతనానికి ఉపయోగించిన హోండా అమేజ్ కారు, వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన పట్నం శెట్టి రాజు @ రాజీ రెడ్డి (41) వృత్తిరీత్యా కారు డ్రైవర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కారులో కోదాడకు తీసుకువచ్చి, రాత్రి సమయంలో ఇక్కడే బస చేసేవాడు. పోలీసులకు అనుమానం రాకుండా తన కారుకు నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ (TS 07 GC 1612) అమర్చుకునేవాడు. రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో కారు పార్క్ చేసి, నడుచుకుంటూ వెళ్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. వేలిముద్రలు పడకుండా చేతులకు షూ సాక్స్ ధరించి, స్క్రూడ్రైవర్‌తో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు.

నిందితుడు 2021 నుండి కోదాడలో 10 దొంగతనాలు చేయగా, ఒక్క 2026లోనే 7 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన నగలను కుదవబెట్టడం, కరిగించడం ద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటూ జల్సాలు చేసేవాడు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించడానికి విజయవాడకు కారులో వెళ్తుండగా, హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయపడి వాహనాన్ని వెనక్కి తీసుకునేందుకు యత్నించిన నిందితుడిని (Serial Burglar) పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

డిక్కిలో సోదాలు చేయగా భారీగా బంగారం, వెండి, నగదుతో పాటు స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్‌లు లభించాయి. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలవాల్సిందేనని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ రోజులు బయటకు వెళ్తే విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తపడాలని సూచించారు. సమాచారాన్ని ఇరుగుపొరుగు వారితో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు ఫోన్ చేయాలని కోరారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్సైలు హరికృష్ణ, సాయిరాం, అజయ్ కుమార్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Also Read : కిషన్ దంచికొట్టాడు.. ఈస్ట్ జోన్ జోరు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>