కలం, వెబ్ డెస్క్ : భారతరత్న పురస్కార గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు (CNR Rao)కు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కర్ణాటకలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఆయన పేరులోని స్పెల్లింగ్ తప్పు కారణంగా, గుర్తింపును నిరూపించుకోవాల్సిందిగా అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు.
2002 ఓటరు జాబితాలో ఆయన పేరు “Prof C N R Rao” అని ఉండగా, ప్రస్తుత జాబితాలో అది “Proff C N R Rao” అని ఒక అదనపు ‘F’తో నమోదైంది. SIR ఫారమ్ నింపే సమయంలో ఈ వ్యత్యాసం రావడంతో ఆటోమేటెడ్ సిస్టమ్ దీనిని “సెల్ఫ్ మిస్‌మ్యాచ్”గా గుర్తించి నోటీస్ పంపింది.
నిబంధనల ప్రకారం నోటీసు వచ్చిన వ్యక్తి మాత్రమే విచారణకు హాజరుకావాల్సి ఉన్నందున, 92 సంవత్సరాల వయసున్న ప్రొఫెసర్ రావు బెంగళూరు మల్లేశ్వరంలోని ఐఐఎస్సీ (IISc) సమీపంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఆర్థికవేత్త అమర్త్య సేన్‌కు కూడా ఇలాంటి స్పెల్లింగ్ పొరపాటే ఎదురైనప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.

