SIR ప్రక్రియపై సీఈఓ తనిఖీ.. బీఎల్‌ఓల పనితీరుపై ఆరా

కలం, నిర్మల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి (CEO Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సీఈఓ తాంసీ, భీంపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తాంసీ మండలం ఘోట్కూరి, భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను తనిఖీ చేశారు. బీఎల్‌ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ.. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు.

ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని సుదర్శన్‌రెడ్డి  స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలిస్తూ అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహశీల్దార్లు సంబంధిత వ్యక్తులకు తగిన మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని సూచించారు. SIR ప్రక్రియ పూర్తయిన అనంతరం కలెక్టర్ల స్థాయిలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ తహశీల్దార్లు శ్రీనివాస్, గణేష్, రమేష్, ఎన్నికల నాయబ్ తహశీల్దార్లు సూరజ్, ఇస్తారీ, ఎన్నికల సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>