కలం, కరీంనగర్ బ్యూరో: యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను (Sports Talent) వెలికితీయడంతో పాటు, ముఖ్యంగా బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అస్మిత (Asmita) ఖేలో ఇండియా (Khelo India) సిటీ లెవల్ రగ్బీ టోర్నమెంట్ (Rugby Tournament) కరీంనగర్ (Karimnagar) అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) ముఖ్య అతిథిగా హాజరై రగ్బీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన మేయర్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
క్రీడలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు యువత, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఖేలో ఇండియా–అస్మిత వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని మేయర్ తెలిపారు.
మట్టిలోని మాణిక్యాలు
మట్టిలోని మాణిక్యాలను గుర్తించి వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా–అస్మిత వంటి కార్యక్రమాలను యువ క్రీడాకారులు, ముఖ్యంగా బాలికలు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని మేయర్ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లాలో రగ్బీ క్రీడ అభివృద్ధికి రగ్బీ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా చేస్తున్న కృషిని మేయర్ అభినందించారు.
బాలికల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణ
ఇటువంటి పోటీల నిర్వహణ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదిక లభిస్తుందని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ శివకృష్ణ, పెద్దపల్లి జిల్లా సెక్రటరీ రామకృష్ణ, సిద్దిపేట జిల్లా సెక్రటరీ అజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీ హనుమంతు, జగిత్యాల జిల్లా సెక్రటరీ మహిపాల్, వెంకటేశ్వర హాస్పిటల్ అడ్మిన్ వెంకటేశ్వర్లు, రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

